తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి ఆయన ఈ నెల 19న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ప్రధాని సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్- విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. అయితే.. కొన్ని కారణాల వల్ల ప్రధాని పర్యటన వాయిదా పడింది.
ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పీఎంవో(ప్రధాని కార్యాలయం) సమాచారం ఇచ్చింది. మళ్లీ ఎప్పుడు పర్యటిస్తారు అనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది. కాగా.. బిజీ షెడ్యూల్ వల్లే ప్రధాని పర్యటన వాయిదా పడిందని, కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే తెలియజేస్తామని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో వందే భారత్ రైలు ప్రారంభంపై సందిగ్థత నెలకొంది. వర్చువల్‌గా ప్రారంభిస్తారా..? లేక మరో రోజున ప్రారంభిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరగనుంది. తొలుత సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఈ రైలును తిప్పాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే.. తర్వాత విశాఖపట్నం వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.