బీజేపీని గెలిపిద్దాం.. బీసీని సీఎం చేద్దాం: ప్రధాని మోదీ
సభ ఆశీర్వాదంతో 2023లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని అన్నారు మోదీ.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 1:50 PM GMTబీజేపీని గెలిపిద్దాం.. బీసీని సీఎం చేద్దాం: ప్రధాని మోదీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎల్బీ స్టేడియం వేదికగా బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పలువురు బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సభా ప్రాంగాణానికి చేరుకున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఎల్బీ స్టేడియంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఇదే గ్రౌండ్‌లో ప్రజల ఆశీర్వాదంతో ప్రధాని అయ్యానని.. అలాగే ఇదే సభ ఆశీర్వాదంతో 2023లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని అన్నారు మోదీ. అయితే.. తెలంగాణలో బీఆర్ఎస్ బీసీని ఎందుకు సీఎం చేయలేదంటూ నిలదీశారు. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. నీళ్లు, నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పాటు అయ్యింది. కానీ.. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని చెప్పారు. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ఉందని..వారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏం చేయలేదని అన్నారు. బీసీల ఆకాంక్షలను ఎప్పుడూ బీఆర్ఎస్ పట్టించుకోలేదంటూ ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక బీఆర్ఎస్.. కాంగ్రెస్ సీటీమ్ అనీ.. కాంగ్రెస్.. బీఆర్ఎస్ సీటీమ్ అంటూ విమర్శించారు మోదీ. ఈ రెండు పార్టీల వెనుక డీఎన్‌ఏ ఒక్కటే అనీ.. అది అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలని చెప్పారు. బీసీల ఆకాంక్షలను పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీనే అని చెప్పారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది కూడా తామే అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. అబ్దుల్ కలామ్‌ను వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారనీ.. పీఏ సంగ్మా, బాలయోగిని స్పీకర్ చేసింది, రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది, గిరిజన మహిళ ద్రౌపదిముర్మును రాష్ట్రపతిని చేసింది బీజేపీనే అని గుర్తు చేశారు. ఇక ఓబీసీ అయిన తనని ప్రధానిని చేసింది కూడా బీజేపీనే అని చెప్పారు. బీసీ యువత కోసం బీఆర్ఎస్ సర్కార్ ఏమీ చేయడం లేదంటూ ఆరోపణలు చేశారు. బీసీలకు రూ.లక్ష ఇస్తామన్న హామీ నెరవేర్చలేదంటూ విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.
బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ డీఎన్ ఏ ఒక్కటేనని మూడు పార్టీలు కుటుంబ పాలన కోరుకుంటున్నాయిని మోదీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని..కొడుకు, బిడ్డా కోసం పనిచేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని..ప్రజాధనాన్ని లూటీ చేసినవాళ్ల సంగతి తేల్చుతామని వార్నింగ్ ఇచ్చారు. అహంకార సీఎంకు బీసీలు ఓటుతో బుద్ధి చెప్పాలని అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.