ప్రధాని మోదీని పట్టుకుని ఏడ్చేసిన మందాకృష్ణ మాదిగ

ప్రధాని నరేంద్రమోదీ శనివారం నాడు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు హాజరయ్యారు.

By Medi Samrat  Published on  11 Nov 2023 8:00 PM IST
ప్రధాని మోదీని పట్టుకుని ఏడ్చేసిన మందాకృష్ణ మాదిగ

ప్రధాని నరేంద్రమోదీ శనివారం నాడు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు హాజరయ్యారు. ఆయన వేదికపైకి రాగానే మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీంతో ప్రధాని మోదీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భుజం తట్టారు. వేదిక పైకి రాగానే మంద కృష్ణను ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత సభకు హాజరైన వారికి అభివాదం చేశారు. వేదికపై ప్రధాని పక్కనే కూర్చున్న మంద కృష్ణ ఒక్కసారి భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ భుజంపై వాలి ఆయన రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనను మోదీ ఓదార్చారు.

మందకృష్ణ మాదిగ చేస్తున్న వర్గీకరణ పోరాటానికి సహకారిగా ఉంటానని, మీకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకు కట్టుబడి ఉన్నానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే ఆనందం రెట్టింపు అవుతుందని, ఇప్పుడు తనకు అలాగే ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మందకృష్ణ మాదిగ తనకు సోదరుడు అని, మీరంతా నా సోదరులే అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా మాదిగ సోదర, సోదరీమణుల మధ్యకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. బీజేపీ అంటేనే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అన్నారు. తమ ప్రభుత్వం తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అన్నారు. బీజేపీ అణగారిన వర్గాల పక్షాన నిలిచిందన్నారు.

మందకృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నారన్నారు ప్రధాని మోదీ. ఈ సమయంలో వేదికపై కూర్చున్న మందకృష్ణను.. తమ్ముడు కృష్ణా అంటూ పిలిచి.. ఇన్నాళ్లు మీరు పోరాడారు... మీ ఉద్యమంలో నేను కూడా ఉంటానని భరోసా ఇస్తున్నాను అని ప్రధాని మోదీ చెప్పారు. అధికారంలోకి రాగానే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. మీ కుర్చీని లాక్కున్నారన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదన్నారు. రైతుబంధు ద్వారా ఎమ్మెల్యేలకు, వారి బంధువులకు మాత్రమే లాభం జరిగిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత్ విరోధి అన్నారు. ఆ రెండు పార్టీలతో మాదిగలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారని, కాంగ్రెస్ అంబేడ్కర్‌ను రెండుసార్లు ఓడించారన్నారు. బీజేపీ హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో అంబేడ్కర్ చిత్రపటం పెట్టామని, భారతరత్న ఇచ్చామన్నారు. దళిత వర్గాలకు చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను తాము రాష్ట్రపతిగా చేసిన సమయంలో కాంగ్రెస్ ఆయనను ఓడించే ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీ తొలిసారి గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిందన్నారు. తాము పెట్టిన అనేక పథకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలే అత్యధిక లబ్ధిదారులన్నారు. మాదిగ సమాజానికి జరిగిన అన్యాయాన్ని నేను గుర్తించానన్నారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడే కాకుండా.. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను పని చేస్తానని హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

Next Story