భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ కు విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పటాన్ చెరులోని ఇక్రిశాట్ చేరుకున్నారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇక్రిశాట్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల కోసం సుమారు ఏడు వేల మంది పోలీసులను మోహరించారు. ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన మోదీ పర్యటకు దూరంగా ఉన్నారు. జ్వరం తగ్గితే ముచ్చింతల్ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి చేరుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.