ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు మరో పిటిషన్ వేశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఇటీవల వైఎస్ జగన్ బెయిల్ పై సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని అన్నారు. ఈడీ కోర్టుకు సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావాల్సి ఉందని కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు రఘురామ. ప్రజలు కరెంటు బిల్లు కట్టకపోతే జరిమానా వేయడమే కాకుండా ఫ్యూజులు పీకేస్తారన్నారు ఎంపీ. కాంట్రాక్టులు చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఎవరి ఫ్యూజులు పీకేయాలని ప్రశ్నించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీల్లేదన్నారు. సినిమా టికెట్ల ధరల నియంత్రణ ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకేనంటున్న మంత్రి పేర్ని నాని దసరా సందర్భంగా ఆర్టీసీ చార్జీల బాదుడుకు ఏం సమాధానం చెబుతారన్నారు.
ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదని రఘురామ అన్నారు. అందరికీ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెండర్లకు ప్రభుత్వం పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో ఎక్కడ టెండర్లు వేసినా.. తెలుగువారుంటారని.. కానీ ఏపీలో టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రావడం లేదని రఘురామ అన్నారు. రంజాన్ పండుగకు తోఫాలు, క్రిస్టమస్‌కు కానుకలు ఇస్తారని మరి హిందువుల పండుగలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.