తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆసక్తి ఉన్న వారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియకు సర్వే సమాచారం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కుల గణన సర్వే మొదలుపెట్టడానికి సుదీర్ఘమైన కసరత్తు చేశామని.. ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్ రే లాంటిదని చెప్పారు. కులగణనతో దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసినట్లు చెప్పారు. సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సామాజిక, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల అమలుకు సర్వే సమాచారం ఉపయోగిస్తామని తెలిపారు.