నేను నా 25 సంవత్సరాల జీవితాన్ని జనసేన పార్టీ కోసం అంకితం చేయడానికి నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ ఏడో వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణగడ్డపై జనసేన జన్మించిదని.. ఉభయరాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడిన్నారు. తాను పాలకులను, ప్రజలను వేరుగా చూస్తానని చెప్పారు. రాజకీయం రెండు కులాల మధ్య నలిగిపోయిందన్నారు.
కేంద్ర బీజేపీ నాయకత్వం జనసేనతో కలిసి ఉందని, కానీ.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని, తెలంగాణ బీజేపీ జనసేనను చులకన చేసేలా మాట్లాడిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీకూతురికి మద్దతు ఇస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికీ దిశానిర్ధేశం చేసిన వ్యక్తి అని తెలిపారు. ఇక ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని, బలంగా పోరాడుదాం.. శక్తి మేరకు కృషి చేద్దాం అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మనల్ని గౌరవించని వారికి అండగా నిలబడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ జనసేన శ్రేణుల గౌరవం నాకు ముఖ్యమన్నారు.