ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఫ్లైట్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు దాదాపు మూడు గంటల పాటు తిండితిప్పలు లేకుండా వేచి చూడాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో విమానం ఆలస్యంగా బయల్దేరుతుందని ఎయిర్ పోర్టు సిబ్బంది అనౌన్స్ చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
వారణాసి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న భక్తులు బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్లారు. అయితే చివరి నిమిషంలో విమానం డీలే అంటూ ప్రకటించారు. ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఎయిర్ లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉదయం 10 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇంకా బయల్దేరకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేస్తే ఎయిర్ లైన్స్ నిర్వాహకులు పట్టించుకోవడంలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
విమానంలో ఏదైనా సమస్య ఉంటే.. ఆలస్యం అవుతుందని ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందని అసహనం వ్యక్తం చేశారు. తీరా విమానాశ్రయానికి వచ్చేసిన తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా గంటల తరబడి కూర్చోబెట్టడం ఏంటని? ప్రయాణికులు సిబ్బందిపై మండిపడ్డారు. అసలే మరికొద్ది గంటల్లో ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ముగియనుంది. ఇలాంటి సమయంలో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.