Hyderabad: భార్య కోసం సరిహద్దులు దాటొచ్చిన పాకిస్తానీ అరెస్ట్
భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.
By అంజి Published on 1 Sept 2023 7:00 AM ISTHyderabad: భార్య కోసం సరిహద్దులు దాటొచ్చిన పాకిస్తానీ అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని కిషన్‌బాగ్ ప్రాంతంలో తన భార్య, అత్తమామలతో కలిసి ఉండటానికి నవంబర్ 2022లో నేపాల్ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడిని మహమ్మద్ ఫైజ్‌గా గుర్తించిన బహదూర్‌పురా పోలీసులు గురువారం ఆగస్టు 31న అరెస్టు చేశారు. అతడి పాకిస్థాన్ పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలోని స్వాత్ వ్యాలీకి చెందిన ఫైజ్ (24) దుబాయ్‌లోని ఓ గార్మెంట్ కంపెనీలో పనిచేసేవాడు. 2019లో అతను హైదరాబాద్ నివాసి, నేహా ఫాతిమా (29)ని కలిశాడు. ఫైజ్ నేహాకు దుబాయ్‌లో ఉద్యోగం పొందడానికి సహాయం చేశాడు. తరువాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఆ తర్వాత నేహా ఇండియాకు తిరిగొచ్చింది. ఫైజ్ తన భార్య తల్లిదండ్రులు షేక్ జుబేర్, అఫ్జల్ బేగం సహాయంతో దేశంలోకి ప్రవేశించాడని, వారు అతని కోసం స్థానిక గుర్తింపు పత్రాన్ని పొందేందుకు పథకం వేశారని పోలీసులు తెలిపారు. వారు నేపాల్ సరిహద్దులో ఫైజ్‌ని కలిసి భారత్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మాదాపూర్‌లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు తీసుకెళ్లి, మహ్మద్ ఘౌస్ పేరుతో తమ 'కొడుకు'గా నమోదు చేసుకున్నారు. వారు నకిలీ జనన ధృవీకరణ పత్రాన్ని కూడా అందించారని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, బహదూర్‌పురాలోని అసద్ బాబా నగర్‌లోని అతని అత్తమామల ఇంటి నుంచి పోలీసులు ఫైజ్‌ను అరెస్టు చేశారు. అయితే అతని అత్తమామలు జుబేర్, అఫ్జల్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.