హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ,మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో, త్వరలో జరగనున్న మిలాద్-ఉన్-నబీ పర్వదినం ఏర్పాట్లకు సంబంధించి పలు కీలక విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని వారు సీఎంకు అందజేశారు.
మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులతో కలిసి సీఎంను కలిసిన ఒవైసీ సోదరులు, పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని ప్రాచీన మసీదులు, దర్గాలను విద్యుద్దీపాలతో అలంకరించేందుకు అవసరమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని తమ వినతిపత్రంలో వారు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా మిలాద్-ఉన్-నబీ జులూస్ (శోభాయాత్ర) శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. కమిటీ సభ్యులు చేసిన విజ్ఞప్తుల పట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.