భారత సైన్యం పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 7న పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలలో పాల్గొనే అందరు ఉద్యోగుల సెలవులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని విభాగాల ఉద్యోగులు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని, మంత్రులు, అధికారులు కూడా అందుబాటులో ఉండాలని, ఏవైనా విదేశీ పర్యటనలు ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ కింద చేపట్టిన సైనిక దాడుల తర్వాత రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి మద్దతు ఇవ్వాలనే బలమైన సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలను దూరం పెట్టాలని అన్నారు. క్లిష్ట సమయాల్లో పార్టీలు సంయమనం పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆపరేషన్ సింధూర్ గురించి మీడియా, సోషల్ మీడియాలో వివాదాస్పద ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.