హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా, ఇప్పటి వరకు రెండు మృతదేహాలు మాత్రమే లభ్యం అయ్యాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా, 8 మంది అందులో చిక్కుకున్నారు.
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) లోపల రెస్క్యూ ఆపరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ, SLBC టన్నెల్ డేంజర్ జోన్‌లో రెస్క్యూ ఆపరేషన్లు, భవిష్యత్ పనులకు ఇన్లెట్ ప్రాంతం ద్వారా సాంప్రదాయ డ్రిల్, బ్లాస్ట్ పద్ధతి (DBM) తప్ప వేరే మార్గం లేదని అభిప్రాయపడింది.
గురువారం జలసౌధలో జరిగిన అధికారులు, కమిటీ సభ్యుల సమావేశంలో.. సొరంగం యొక్క 50 మీటర్ల ప్రమాద ప్రాంతంలో రాళ్ల పొరలు, నీరు , ఇతర అంశాల దృష్ట్యా సొరంగం మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ సహాయక చర్యలు మరింత ప్రమాదకరంగా మారాయి.
పర్యావరణ నిబంధనలను పరిశీలించి సిఫార్సులు చేయడానికి ఒక సాంకేతిక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అనేక జాతీయ సంస్థలతో పాటు, కల్నల్ పరీక్షిత్ మెహ్రాకు దీనిలో స్థానం కల్పించారు. ప్రస్తుత ప్రమాదం నేపథ్యంలో, తవ్వకానికి ప్రత్యామ్నాయ చర్యలపై సూచనలు అందించే బాధ్యతను దీనికి అప్పగించారు.