పదో తరగతి హిందీ పేపర్ లీక్‌లో విద్యార్థి హరీష్ యాదవ్‌కు ఏలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా సీతారాంపూర్ గ్రామంలో బాధిత విద్యార్ధి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎవరో చేసిన తప్పుకు అమాయకుడైన విద్యార్ధిపై డిబార్ వేటు పడడం దుర్మార్గపు చర్య అన్నారు. విద్యార్ధి హరీష్ యాదవ్‌కు ఏలాంటి ప్రమేయం లేదని స్వయాన వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారని.. అలాంటప్పుడు ఎందుకు ఆ విద్యార్ధిపై అయిదేళ్లు డీబార్‌కు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
విద్యార్థి వైపు న్యాయం ఉంది.. దాని కోసం ఎన్‌ఎస్‌యూఐ పోరాడుతుందని అన్నారు. తామే విద్యార్థి తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. విద్యార్ధి తండ్రి రాజు ద్వారా కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అందుకు అయ్యే కోర్టు ఖర్చులు మొత్తం ఎన్‌ఎస్‌యూఐ నే భరిస్తుందని భరోసా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఏకమయ్యి పేపర్ లీకులు చేసుకుంటూ అమాయకులను బలికోరుతున్నారని విమర్శించారు. ఎస్సెస్సీ విద్యార్థి హరీశ్ కు, అతని కుటుంబానికి అండగా నిలిచి వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.