కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
By - Medi Samrat |
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాల కోసం టెండర్లు నిర్వహిస్తారు. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్‌ల కోసం ఆగస్టులోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దుకాణాల రిజర్వేషన్, దరఖాస్తు తేదీలపై తాజాగా వివరాలు వెల్లడించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ్‌లకు రిజర్వేషన్ అమలు చేయగా.. తాజాగా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
ఆయా జిల్లాల వారీగా దుకాణాలకు రిజర్వేషన్ వర్తింపజేయనున్నారు. ఏ దుకాణానికి ఏ రిజర్వేషన్ అమలు చేయాలనే దాని కోసం సెప్టెంబర్ 25న కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. అనంతరం 26న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదే రోజు నుంచి కొత్త దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 18 వరకు దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 23న కొత్త దుకాణాల కేటాయింపు కోసం డ్రా తీస్తారు. దుకాణాలు దక్కించుకున్న వారు అక్టోబర్ 23, 24 తేదీల్లో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలి. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం అవుతాయి.
ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవడానికి రూ.3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ మొత్తం రూ.2 లక్షలు ఉండగా.. తాజాగా రూ.లక్ష పెంచారు. దీంతో దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది.