శంషాబాద్ నుండి షికాగో.. ఇక నాన్ స్టాప్
Non-stop Air India flight from Hyderabad to Chicago. భారత్ నుండి అమెరికాకు వెళ్లడమంటే వ్యయప్రయాసలతో కూడుకున్నదే
By Medi Samrat Published on 15 Jan 2021 8:15 AM GMTభారత్ నుండి అమెరికాకు వెళ్లడమంటే వ్యయప్రయాసలతో కూడుకున్నదే.. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ విషయంలో చాలా అవస్థలు పడాలి. అయితే అమెరికా వెళ్ళాలి అని అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్.. ఎందుకంటే శంషాబాద్ విమానాశ్రయం నుండి నాన్ స్టాప్ విమానం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారికి నేటి నుంచి షికాగోకు నాన్‌స్టాప్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. మధ్యాహ్నం షికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులను శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ప్రారంభించనున్నారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానం షికాగో బయల్దేరనుంది. షికాగో నుంచి ప్రతి బుధవారం హైదరాబాద్‌కు మరో విమానం బయల్దేరనుంది. హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి. హైదరాబాద్ నుంచి షికాగోకు డైరెక్ట్ సర్వీసులు ప్రారంభం కానుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయ అధికారులు, ఎయిరిండియాకు అభినందనలు తెలిపారు. మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్‌కు ఇది తొలి అడుగని కేటీఆర్ చెబుతున్నారు. ఎయిరిండియా సేవలపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు భారత్ నుండి అమెరికాకు వెళ్ళడానికి ప్రయాణ ఛార్జీలు కూడా ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలకు విమానాలు నడుస్తున్నాయి. మంగళవారం ముంబై నుంచి న్యూయార్క్, ముంబై నుంచి నెవార్క్ వెళ్లే విమానాలకు అతి తక్కువ చార్జీలు రూ.లక్ష, రూ.1.4 లక్షలు ఉన్నాయంటే టికెట్ ధరలు ఎంతగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ముంబై నుంచి వెళ్లే విమానాలతో పోలిస్తే ఢిల్లీ నుంచి వెళ్లే వాటికి మాత్రం చార్జీలు తక్కువగానే ఉన్నాయి. ఢిల్లీ నుంచి నెవార్క్ వెళ్లే విమానాలకు అతి తక్కువ చార్జీ రూ.95 వేలుగా ఉంది. ఇక ఎయిరిండియా ప్రారంభించిన బెంగళూరు–శాన్ ఫ్రాన్సిస్కో విమానాల్లో ప్రయాణాలకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ నెలలో దాదాపు సీట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈ రూట్ లో అతి తక్కువ చార్జీ రూ.98 వేలు.
Next Story