తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. అయితే వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండిపోయాయి. ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతం అయిన బొగత జలపాతంకు వరద పోటెత్తింది. ప్రస్తుతం బొగత వద్ద భీకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ఈ తెల్లవారుజామున ప్రకటన విడుదల చేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ముత్యంధార, కొంగర, మామిడిలోద్ది, కృష్ణపురం పర్మినెంట్‌గా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులు ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.