తెలంగాణ ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించనని, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సహకాలు తీసుకోండి. షూటింగ్‌లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోవచ్చని అన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలు జరగవన్నారు రేవంత్ రెడ్డి.
తొక్కిసలాటకు కారణం అయిన అల్లు అర్జున్ ను ఒక్క రోజు అరెస్ట్ చేస్తేనే ఆయన ఇంటికి మొత్తం సినిమా ఇండస్ట్రీ క్యూ కట్టిందని.. సినిమా వాళ్లు అంతా ఆయనకు ఇంటికి వెళ్లి పరామర్శించారని, ప్రభుత్వాన్ని, నన్ను తిడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ వస్తున్నట్లు డిసెంబర్ 2న అప్లికేషన్ పెట్టుకున్నారని,3న పోలీసులు తిరస్కరించారని సీఎం తెలిపారు. పోలీసులు తిరస్కరించిన తర్వాత కూడా 4 తేదీన సాయంత్రం అల్లు థియేటర్ కు వచ్చారని అన్నారు. అల్లు అర్జున్ ప్రైవేటు సెక్యూరిటీ.. 50, 60 మంది బౌన్సర్లు విపరీతంగా ఎలా పడితే అలా తోసేయడంతో తొక్కిసటాల జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.