హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చేయనున్న మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారిందన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైన, హామీల అమలు వైఫల్యం పైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. నిర్బంధంలోకి తీసుకున్న తమ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి లను, నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.