కాంగ్రెస్ ఎన్ని నోట్ల కట్టలు పంచినా.. గెలిచేది బీఆర్‌ఎస్సే: హారీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By అంజి Published on 13 Oct 2023 8:00 AM GMTకాంగ్రెస్ ఎన్ని నోట్ల కట్టలు పంచినా.. గెలిచేది బీఆర్‌ఎస్సే: హారీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కలలు కన్నా.. అవి పగటి కలలే అవుతాయన్నారు. ముమ్మాటీకి కేసీఆరే విజయం సాధిస్తారని మంత్రి అన్నారు. ఎన్ని నోట్ల కట్టలు పంచినా.. గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ డబ్బులు ఉన్న వారికే టికెట్ ఇస్తుందని, వారి నుంచి డబ్బులు వసూలు చేసి, ఎన్నికల్లో పంచి గెలవాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో తగిన గుణపాఠం తప్పదని హారీష్ రావు అన్నారు. బెంగళూరులో ఐటీ అధికారులు కాంగ్రెస్ నేతల ఇళ్లలో జరిపిన తనిఖీలు రూ.42 కోట్లు బయటపడ్డాయన్నారు.
బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయన్న మంత్రి.. అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం చేశారని అన్నారు. కర్ణాటకలో గతంలో 40 శాతం కమిషన్ ప్రభుత్వం ఉంటే.. ఇప్పుడు 50 శాతం కమిషన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంబికాపతి ఆ రోజుల్లో 40 శాతం కమిషన్‌కి పని చేసేవారని, నేడు అదే అంబికా పతి 50% కమిషన్ వసూలు చేసి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తున్నారని మంత్రి అన్నారు.
అంబికాపతి సతీమణి అశ్వత్తమ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటరని, ఇద్దరూ ఇంట్లో వుండగానే ఐటి దాడులు జరిగాయని, ఐటీ దాడుల్లో రూ. 42 కోట్ల నగదు లభ్యమయ్యాయని అన్నారు. తెలంగాణకు తరలించేందుకు కాంట్రాక్టర్ ల నుంచి వసూలు చేసిన డబ్బు ఇది అని తెలుస్తోందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబికాపతి , డీకే శివ కుమార్ కు అత్యంత సన్నిహితుడు అని, ఈశ్వరప్పకి కూడా సన్నిహితుడు అని తెలుస్తున్నది. కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, వ్యాపారుల నుండి, కాంట్రాక్టర్ దగ్గరి నుండి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయాలని, ఈ అక్రమ వసూళ్లకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
ఈ డబ్బులను బెంగళూరు నుండి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ పంపాలని ప్లాన్ చేశారని హరీష్ రావు అన్నారు. ఇందులో కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నదని అన్నారు. కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే ప్రయత్నం ఎవరైతే చేస్తారో భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ దొడ్డి దారిన గెలిచే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
''కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను నిర్ణయించుకోలేని పరిస్థితి. టికెట్లు తెచ్చుకోలేని పార్టీ. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. పక్కా పార్టీల దిక్కు చూస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. షెడ్యూల్ వచ్చినా టికెట్లు డిక్లేర్ చేసుకోలేని దుస్థితి. సగం సీట్లలో అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్. అభ్యర్థులు లేని కాంగ్రెస్, డబ్బులతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు'' అంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.