ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో శాసనమండలి సభ్యులుగా కసిరెడ్డి నారాయణరెడ్డి, పి.మహేందర్‌రెడ్డి, ఓ యాదవరెడ్డి, ఎల్.రమణలు గెలిచారు. కాగా గురువారం నాడి వారితో శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇ.దయాకర్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇక ఈ మధ్యనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత కూడా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ.. కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. కవిత ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అనంతరం మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలు ఖాళీ కాగా.. వాటికి ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. ఆ 12 స్థానాల నుండి గెలిచిన వారి పదవీ కాలం జనవరి 5వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.