100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు కొత్త భవనం

హైదరాబాద్ శివార్లలోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల స్థలంలో తెలంగాణ హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించనున్నారు.

By అంజి
Published on : 15 Dec 2023 7:30 AM IST

New building, Telangana, High Court, CM Revanth Reddy

100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు కొత్త భవనం

హైదరాబాద్ శివార్లలోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల స్థలంలో తెలంగాణ హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు వచ్చే నెలలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను గురువారం ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ తెలంగాణాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, ఉన్నతాధికారులతో కలిసి కొత్త హైకోర్టు భవన నిర్మాణంపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో కొత్త భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేయాలని వారు సీఎంను కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత హైకోర్టు భవనం వారసత్వ కట్టడంగా జాబితా చేయబడినందున, భవనాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.

ప్రస్తుతం ఉన్న భవనాన్ని పునర్నిర్మించి సిటీ కోర్టు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చొరవ తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు సీఎంను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story