దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి
దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లోని 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
By Knakam Karthik
దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి
పహల్గాం ఉగ్ర దాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఊహించని షాక్ ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్. తాము కూడా దాడులు చేస్తామని ప్రకటన చేసింది. ఈ సంక్షోభ సమయంలో పౌరులు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లోని 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్స్‌లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోమ్‌గార్డ్స్, ఎన్‌సీసీ కోర్, ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూయువ కేంద్ర సంఘటన్, కాలేజ్‌లు, స్కూల్ విద్యార్థులకు ఇప్పటికే కేంద్రం పిలుపునినిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టారు.
కాగా హైదరాబాద్‌లోనూ ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై పౌరులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సిటీలోని పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్‌లోని మెయిన్ సెంటర్లలోనూ సైరన్లు మోగాయి. నాలుగు ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. వైమానిక దాడి జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు అవగాహన కల్పించారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన మాక్ డ్రిల్ 4.30 వరకు కొనసాగింది. ఈ మాక్ డ్రిల్స్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ మాక్ డ్రిల్స్‌ను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.