అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన ఘనుడు కేసీఆర్.. నాగం జనార్దన్ ఫైర్.!

Nagam janardhan reddy hot comments. టీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి. మహబూబ్‌నగర్‌లో

By అంజి  Published on  14 Oct 2021 8:20 AM GMT
అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన ఘనుడు కేసీఆర్.. నాగం జనార్దన్ ఫైర్.!

టీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి. మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కాంగ్రెస్‌ జంగ్‌సైరన్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ భరతం పట్టేందుకు రేవంత్‌ పీసీసీ చీఫ్ అయ్యాడని, ఆయనపై అనవసర విమర్శలు మానుకోవాలన్నారు. రేవంత్‌పై జైల్లో పెడతామని చెబుతున్నారని... రేవంత్‌పై ఉన్న కేసులు ఎన్నికల సంఘం పరిధిలోనివని, ఆయనను జైల్లో పెట్టడం మీ నుంచి కాదన్నారు. కేసీఆర్‌ తిరుపతికి వెళ్లినప్పుడు రాయలసీమను రతనాల సీమగా చేస్తానని అన్నారని, అప్పుడు పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల నోళ్లు ఎందుకు మూసుకుపోయాయో చెప్పాలన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై అసలు టీఆర్‌ఎస్‌ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసా అంటూ నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై అవగాహన తెచ్చుకోవాలన్నారు.

కిరణ్ కుమార్‌ రెడ్డి, వైఎస్‌ హయాంలోనే పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలయ్యాని, కాంగ్రెస్ హయాంలో పెట్టిన మోటార్లను కేసీఆర్‌ సర్కార్‌ కిందికి దింపి నాలుగు బోల్టులు బిగించి కొబ్బరికాయలు కొడ్తున్నారని విమర్శించారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కొహిల్‌ సాగర్‌లు అన్ని కాంగ్రెస్ హయాంలోనే చేసినవేనని, వాటికి లిఫ్ట్‌లు, ప్రధానలు కాల్వలు కూడా అప్పుడే నిర్మించామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాలకు నీరు అందేది, ఆ ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్‌ ఎక్కడున్నారు అంటూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ పంప్‌ మోటార్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఒక వేళ జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఒక వేళ స్కామ్ జరిగితే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డికి సవాల్ విసిరారు నాగం. దీనిపై ఎవరు చర్చకు వస్తారు.. హరీష్ వస్తాడా.. నిరంజన్‌ రెడ్డి వస్తాడా చెప్పాలన్నారు.

రాష్ట్రాన్ని కేసీఆర్‌ పీల్చి పిప్పి చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్‌ చుట్టూ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసలని అన్నారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టుకు పోలేదన్నారు. పాలమూరును ఎడారిగా మారుస్తున్నా జిల్లా మంత్రులు పెదవి విప్పడం లేదన్నారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహానికి కనీసం దండ వేయకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ నిబంధనలకు విరుద్ధంగా 300 టీఎంసీల నీటిని వాడుకుంటోందని, పైసల కోసం ప్రాజెక్టులు కడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ సర్కార్ శాశ్వతం కాదని.. అధికారులు జాగ్రత్తగా పని చేయాలన్నారు. అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన ఘనుడు కేసీఆర్‌ అని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

Next Story