మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
Munugodu by-election schedule released. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్
By అంజి
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 14తో ముగియనుంది. 15న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
నవంబర్ 3న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలోనే తొలి నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సాలో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్‌తో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈ బైపోల్ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలోకి దిగుతుండగా, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఇంత వరకు మునుగోడు అభ్యర్థిని ప్రకటించలేదు. తర్వలోనే మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో సత్తా చాటాలనే పట్టుదలతో బీజేపీ ఉంది.