మునుగోడు ఉప ఎన్నిక.. నేటి నుంచే నామినేషన్లు
Munugode By poll Nominations starts from today.మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది.
By తోట వంశీ కుమార్ Published on 7 Oct 2022 3:00 AM GMTబతుకమ్మ, దసరా పండుగలు ముగిశాయి. ఇక తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపై పడింది. ఈ ఉప ఎన్నిక ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. ఈరోజు(శుక్రవారం) నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జగన్నాథరావు వ్యవహరించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
చండూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌటింగ్ పూర్తైన తరువాత అదే రోజు ఎవరు గెలిచారు అనే దానిని ప్రకటించనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
ఇప్పటికే చండూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక ఉప ఎన్నికకు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చండూరు తహశీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురుకి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇవ్వనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం స్థానిక జడ్పీహెచ్ఎస్‌లో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 6 చెక్‌పోస్టుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నారు.
ప్రచారాన్ని వేగవంతం చేయనున్న పార్టీలు..
నేటి నుంచే నామినేషన్‌లు మొదలుకావడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని వేగవంతం చేయనున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ నియోజకవర్గంలో త్రిముఖపోరు ఉంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఉపఎన్నికను ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడుకు పయనం అయ్యారు. 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో శుక్రవారం సాయంత్రానికి అంతా మునుగోడుకు చేరుకోనున్నారు. ఉప ఎన్నికల బాధ్యతను మంత్రి వర్గం మొత్తానికి అప్పగించింది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు మానిటరింగ్ బాధ్యతలను అప్పగించింది.
ఇప్పటి వరకు అయితే.. టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే టీఆర్ఎస్ పేరుతో అభ్యర్థి పోటీచేస్తారా లేదా కొత్తగా ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరుతో పోటీ చేస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేస్తూ ఇప్పటికే తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించి.. గుర్తించినట్లు ప్రకటిస్తే మాత్రం బీఆర్ఎస్ పేరుతోనే మునుగోడులో కేసీఆర్ పార్టీ పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక కావడంతో కేసీఆర్ వ్యక్తిగతంగా కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.