తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉందని ఆయన ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా, కుల గణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని విమర్శించారు. ఇది బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర అని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలకు మార్చుకోకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందని అన్నారు.
పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తానని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో అనేక లోపాలున్నాయని.. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు.
ఇదిలా ఉంటే.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చట్టబద్ధతతో పని లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ తరపున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా అంతే శాతం టికెట్లు కేటాయిస్తారా అంటూ ప్రశ్నించారు. కాగా ఇప్పుడు ఆర్.కృష్ణయ్య బీసీల రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చర్యనీయాంశమయ్యాయి.