మునుగోడు కాంగ్రెస్ కంచుకోట.. దాన్ని కాపాడుకుంటాం

MP Revanth Reddy Fires On CM KCR. కాంగ్రెస్ పార్టీ లో చేరిక‌లు జోరందుకున్నాయి. మాజీ మంత్రి భీమ్ రావ్ కూతురు

By Medi Samrat  Published on  30 July 2022 3:11 PM GMT
మునుగోడు కాంగ్రెస్ కంచుకోట.. దాన్ని కాపాడుకుంటాం

కాంగ్రెస్ పార్టీ లో చేరిక‌లు జోరందుకున్నాయి. మాజీ మంత్రి భీమ్ రావ్ కూతురు, అసిఫాబాద్ ఆదివాసీ నేత ముర్సుకొల సరస్వతి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసిఆర్ కుటుంబ పాలన తెలంగాణకు ప్రమాదకరంగా మారిందని అన్నారు. దుష్ట చతుష్టయం పాలనను అంతం చేయడానికి నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాహుల్, సోనియా గాంధీ నాయకత్వం పై విశ్వాసం ప్రకటిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కేసిఆర్ కుటుంబం కోసం కాదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటును తప్పుగా మాట్లాడిన బీజేపీ కోసం రాష్ట్రం ఇవ్వలేదని.. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలు పెంచాయని.. వ్యాట్ రూపంలో రాష్ట్రం దోచుకుంటుందని విమ‌ర్శించారు. వారం రోజులుగా ఢిల్లీ లో కేసిఆర్ ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. ప్రజలు వరదల్లో నష్ట పోతే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. తండ్రి ఢిల్లీ లో, ఆయన కొడుకు కాలు జారి హోం థియేటర్ ఎదుట‌ కూర్చున్నార‌ని అన్నారు.

చికోటి చీకటి కోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారన్నారు. ఆయన వెనుక వున్న చీకటి మిత్రులు ఎవరో తేలాలని అన్నారు. దీనిపై జుడిషియల్ విచారణ జరిపించాలని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని సెటైర్లు వేశారు. ఈ హవాలా ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందా అని అనుమానం వ్య‌క్తం చేశారు. ఎస్వోటి, టాస్క్ ఫోర్స్ ఏమైందని ప్ర‌శ్నించారు. గిరిజనుల మీద ప్రతాపం చూపే మీరు.. దొంగలకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఇచ్చే మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోరని నిల‌దీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రిపై.. దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

బండి పాదయాత్ర చేసే ముందు.. తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. బండికి పాద యాత్ర చేసే నైతిక హక్కు లేదని.. బీజేపీ జెండా ఎగరడానికి వీలు లేదని అన్నారు. కేంద్రం నుంచి వరద నష్ట పరిహారం కోసం కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని సూచించారు. నిత్యావసర ధరల పెంపనకు నిరసనగా, వరద నష్టాల నుంచి ప్రజలను ఆదుకోవాలని పోరాటం చేయాల‌ని అన్నారు.

ఆగస్ట్ 5న అన్ని నియోజక వర్గ, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేప‌ట్ట‌నున్న‌ట్టు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి తో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని.. మాట్లాడే భాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట.. దాన్ని కాపాడుకుంటామ‌ని తెలిపారు. ఉపద్రవం వచ్చినా నష్టం జరగకండా అప్రమ‌త్తంగా ఉంటాం అని తెలిపారు.


Next Story