కేటీఆర్ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దొంగలుగా దొరికిపోయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని.. కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి పిచ్చి వాడిలాగా మాట్లాడుతున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. నిబంధనలను ఉల్లంఘించి 55 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని విదేశీ కంపెనీలకు ఇచ్చి ఇప్పుడు నిజాయితీ పరునిలాగా మాట్లాడ్డం విడ్డురంగా ఉందన్నారు. అసలు ఇది కేసు కాదు.. లొట్టపీసు కేసు అని, దమ్ముంటే అరెస్ట్ చెయ్యమని, నా వెంట్రుక కూడా పీకలేరు అని అనేక మాటలను మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడు నేను నన్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టులో, సుప్రీంకోర్టు లో కేసులు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. చట్టంపైన పూర్తి నమ్మకం ఉందని చెప్తున్న కేటీఆర్.. తప్పు లేకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముందే చెప్పారు.. కేటీఆర్ తాను తప్పు చేశాననే విషయాన్ని దాటవేసేందుకు రేవంత్ రెడ్డిపైన అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ మాటలను ప్రజలు ఎవరు విశ్వసించరన్నారు. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.