యాంకర్లు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా.?

85 వేల కోట్లు 10 ఏళ్లలో ఖర్చు చేస్తే మేము ఒక్క ఏడాదిలోనే 53 వేల కోట్లకు పైగా ఖర్చు చేసాం.. కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనం..

By Medi Samrat  Published on  6 Jan 2025 3:20 PM IST
యాంకర్లు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా.?

85 వేల కోట్లు 10 ఏళ్లలో ఖర్చు చేస్తే మేము ఒక్క ఏడాదిలోనే 53 వేల కోట్లకు పైగా ఖర్చు చేసాం.. కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనం.. బీఆర్ఎస్ ఏడాదికి ఖర్చు చేసింది 7 వేల కోట్లు దాటలేదు. బడా బాబులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే కొండలు, గుట్టలకు రైతుబంధు వేసి 20 వేల కోట్లు వృధా చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలు చేయలేకపోవడానికి బీఆర్ఎస్ చీకటి జీవోలే కారణం అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసేలా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సాగిందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను గమనించాలన్నారు.

సాగు చేసే రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్న కేంద్రం ఇచ్చేది 6 వేలు మాత్రమే.. రైతులపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలపై మోదీని ఒప్పించి దేశమంతా ఇప్పియ్యాలన్నారు. రాజకీయ నేతలు రాజకీయాలు చేసేందుకు చెప్పే ప్రచారాలను నమ్మకుండా.. ప్రజలు వాస్తవాలను గమనించాలన్నారు. 20 వేల కోట్లు రోడ్లకు, పాడవు బద్ధ భూములకు, బిల్డింగ్ లకు ఎందుకు ఇచ్చారో కేటీఆర్ చెప్పాలి, ప్రజలే కేటీఆర్ కు గుణపాఠం చెప్తారు. వరి వేస్తే ఉరి అని నిబంధనలు పెట్టిన బీఆర్ఎస్‌ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి పంపిస్తే.. ఈడీ విచారణకు పిలిస్తే కేటీఆర్ డ్రామాలు ఆడుతూ.. సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేస్తున్నార‌న్నారు.

రేవంత్ రెడ్డి నిజాం నవాబులా వ్యవహరించడం లేదు.. మా మంత్రులు నిలబడలేదని ఇష్టరీతిన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులను మీ ఇంటి కాడ అటెండర్లుగా చూశారు, మా సీఎంది ఆ సంస్కృతి కాదన్నారు. సోషల్ మీడియా ద్వారా సీఎంను చిన్నబుచ్చే కుట్ర కేటీఆరే చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యాంకర్లకు సీఎంలు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా? అని ప్ర‌శ్నించారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామ‌న్నారు.

Next Story