కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు త్వరలోనే బీజేపీలోకి రావడం ఖాయం : ఎంపీ అరవింద్
MP Aravind Comments On CM KCR. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందన్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి
By Medi Samrat
రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందన్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సృష్టించిందని.. పాలక భారత రాష్ట్ర సమితి (BRS)కి ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అరవింద్.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతోందని, బీజేపీ బలహీనపడిందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం అంతా మీడియా సృష్టేనని అన్నారు.
బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందన్న ఆరోపణలను తిప్పికొట్టిన ఆయన.. గులాబీ పార్టీతో తమ పార్టీకి ఎలాంటి పొత్తు లేదని అన్నారు. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడం వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదని, ఇద్దరు నేతలకు ఆయా జిల్లాల్లో ఎలాంటి ప్రభావం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు త్వరలోనే బీజేపీలోకి రావడం ఖాయమన్నారు. ఖమ్మంలో బీజేపీ విజయానికి తమ వద్ద స్ట్రాటజీ ఉందన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని చెప్పారు. బిడ్డను కాపాడటానికే కేసీఆర్ తాపత్రయమని ఎద్దేవా చేశారు. కుటుంబ పార్టీలకు ఓటేస్తే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయని.. పిల్లలకు భవిష్యత్ కావాలంటే బీజేపీకి ఓటయ్యాలని మోదీ పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు.