పురుగుల మందుతో మోత్కుపల్లి నర్సింహులు
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో హల్‌చల్ చేశారు.
By Medi Samrat Published on 21 Oct 2023 11:48 AM GMTమాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో హల్‌చల్ చేశారు. దళితులకు అన్యాయం జరిగితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని గతంలోనే చెప్పానని.. దళతబంధు అమలు కాకపోవడంతో దళిత యువత తనకు సందేశాలు పంపిస్తోందన్నారు. కేసీఆర్ ముహూర్తం పెడితే తాను గడ్డిమందు తాగి చనిపోతానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్మి తాను పొరపాటు చేశానంటూ చెప్పుకొచ్చారు మోత్కుపల్లి. దళితబంధును తీసుకువస్తున్నానని కేసీఆర్ తనను స్వయంగా ఆహ్వానిస్తే పార్టీలోకి వెళ్లానని, దళితులకు మేలు జరుగుతుందనుకున్నానని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. దళిత బంధు అమలు కాకుంటే తాను గడ్డిమందు తాగుతానని గతంలో చెప్పానన్నారు. అందుకే ఈ గడ్డి మందు డబ్బాను పట్టుకొని వచ్చానన్నారు.
కేసీఆర్ గట్టిగా ఉన్నాడని, ఎలాగూ చావడని, తానైనా చనిపోతానని మోత్కుపల్లి తెలిపారు. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని.. చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముప్పై సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వాలన్నారు. తనకు తుంగతుర్తి సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టమన్నారు.