బీజేపీకి బిగ్ షాక్‌.. పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి

Mothkupally Narasimhulu Resigned For BJP. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

By Medi Samrat  Published on  23 July 2021 7:09 AM GMT
బీజేపీకి బిగ్ షాక్‌.. పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేర‌కు రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు రాజీనామా లేఖ‌ను పంపారు. దేశ, రాష్ట్ర రాజ‌కీయాల్లో మారుతున్న ప‌రిణామాల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా సేవ చేయ‌డం కోసం బీజేపీలో చేర‌డం జ‌రిగింద‌ని.. కానీ బీజేపీ అధినాయ‌క‌త్వం నా సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వాన్ని వాడుకుని పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తుంద‌ని అనుకున్నాను. కానీ అలా జ‌ర‌గ‌లేదు.. నాకు అవ‌కాశం క‌ల్పించ‌డంలో పార్టీ విఫ‌లం చెందింద‌ని భావించాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని రాసుకొచ్చారు. పార్టీ న‌న్ను ఒక్క‌మాట కూడా అడ‌గ‌కుండ ఈటెల రాజేంద‌ర్‌ను చేర్చుకోవ‌డం న‌న్ను బాధించింద‌ని.. నా అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా రాజ‌కీయాల్లో విలువ‌ల కోస‌మే ప‌నిచేసే న‌న్నుదూరం పెట్ట‌డం బాధాక‌ర‌మ‌ని భావిస్తూ.. పార్టీకి రాజీనామా చేస్తున్నాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. గత నెల 27న తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశాన్ని బీజేపీ బ‌హిష్క‌రించింది. పార్టీ ఆదేశాలు కాద‌ని మోత్కుప‌ల్లి ఆ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. మోత్కుపల్లికి, పార్టీ నాయకత్వానికి మధ్య చిచ్చు పెట్టింది ఆ స‌భే అని అంటున్నారు. సమావేశానికి హాజరైనప్పటి నుంచి.. మోత్కుపల్లిని బీజేపీ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత మోత్కుపల్లి బీజేపీపై ఒకింత స్వరం పెంచారు. ఇప్పటికే బీజేపీకి, దళితులకు మధ్య గ్యాప్ ఉందని.. ఇలాంటి తరుణంలో తాను దళిత ప్రజాప్రతినిధిగా బీజేపీ తరుపున ఆ సమావేశానికి హాజరుకావడం పార్టీ గౌరవాన్ని కాపాడినట్లయిందని అన్నారు.

అంతేకాదు.. దళిత సాధికారత పథకాన్ని.. సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించిన తీరును మోత్కుప‌ల్లి ప్రశంసించారు. ఇంతవరకూ ఏ సీఎం దళితుల కోసం ఇంత సమయం వెచ్చించి వారి సమస్యలపై చర్చించలేదని అన్నారు. దళితులకు మేలు జరుగుతుంటే ఆ వర్గ నేతగా తాను వెళ్లకపోతే ఎలా అని ప్ర‌శ్నించారు. పైగా పార్టీ నాయకత్వానికి చెప్పే తాను వెళ్లానని.. ఎక్కడా పార్టీ లైన్‌ను దాటలేదని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీని వీడుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే న‌ర్షింహులు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.


Next Story