వాహనదారులకు బిగ్‌ షాక్‌.. ట్రాఫిక్‌ చలాన్లపై సీఎం రేవంత్‌ కొత్త రూల్‌

రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

By -  అంజి
Published on : 13 Jan 2026 6:53 AM IST

Money, deducted, bank account, challan, vehicle, CM Revanth Reddy, Telangana

వాహనదారులకు బిగ్‌ షాక్‌.. ట్రాఫిక్‌ చలాన్లపై సీఎం రేవంత్‌ కొత్త రూల్‌ 

రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో #ArriveAlive రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన ఎజెండాగా విధివిధానాలతో నూతన చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని చెప్పారు.

"ఒకప్పుడు శాంతి భద్రతలు ప్రధాన సమస్యగా ఉండేది. ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ అతిపెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రత కోసం డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్ నియంత్రణ కోసం గూగుల్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసుకోవడమే కాకుండా ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం. ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడం దురదృష్ణకరం. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేప్పుడు మనం తప్పు చేయకపోయినా, ఎదుటివారి తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా చేసిన హత్యలుగా భావించాలి.

సైబర్ క్రైమ్ పెరిగిన నేపథ్యంలో నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు, తీవ్రవాదాన్ని అణిచివేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ లాంటి సంస్థలను, టెర్రరిస్టు, మిలిటెంట్ కార్యక్రమాలను నియంత్రించడానికి గ్రేహౌండ్స్ వ్యవస్థలను ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచాం. మాదకద్రవ్యాలను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే చెరువులు, కుంటల కబ్జాలను నివారించడానికి హైడ్రాను ఏర్పాటు చేసుకున్నాం. అదే తరహాలో ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.

మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవ్‌ చేసేవారిని నియంత్రించాలి. ఉల్లంఘనలపై చలాన్లు వేస్తున్నారు. మళ్లీ వాటిని కట్టడానికి ఆఫర్లు ఇస్తున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లతో వాహనాలను అనుసంధానం చేయండి. చలాన్ పడిన వెంటనే వారి బ్యాంక్ ఖాతా నుంచి అటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా బ్యాంకులతో సమన్వయం చేసుకునే ప్రణాళికలు చేయండి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయాలి. ఇలాంటి వాటిని నివారించడానికి చిన్నతనం నుంచి అవగాహన కల్పించాలి" అని ముఖ్యమంత్రి అన్నారు.

రోడ్డు భద్రతపై ఒక అహగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికను రూపొందించడాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, పలువురు ప్రజా ప్రతినిధులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్, తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story