గుడ్‌న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు
By - Knakam Karthik |
గుడ్‌న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి, ప్రకృతి వైపరీత్యాల భారిన పడ్డ రైతాంగానికి బాసటగా ఉంటాం అని రాష్ట్ర పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు నమోదు చేసిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు జరుపాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణా కొత్త రికార్డ్ నెలకొల్పిందని, స్వతంత్ర భారత దేశంలో ఇంతటి ఉత్పత్తి ఇదే ప్రధమం అని, ముందెన్నడూ లేని రీతిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇదే ప్రప్రథమం అని ఉత్తమ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రజాప్రతినిధులు విధిగా బాగాస్వామ్యం కావాలని సూచించారు. భారతదేశ చరిత్రలోనే ఒక్క సీజన్ లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.