ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. రామగుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల కర్మాగారాన్ని కూడా ప్రధాని హైదరాబాద్ నుంచే వర్చువల్‌గా ప్రారంభించే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రధాని హైదరాబాద్‌కు వస్తున్నారు అనే వార్త భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో జోష్ నింపుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా లు హైదరాబాద్‌లో పర్యటించగా.. ఇప్పుడు ప్రధాని పర్యటన ఖరారుకావడం, మూడు వారాల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తుండం బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలకు మరింత బూస్టింగ్‌నిస్తోంది. ఇక ప్రధాని పర్యటనను కనీవిని ఎగురని రీతిలో దిగ్విజయం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు.
పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించే అన్ని మార్గాల్లో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన కీలక నేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అవుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.