మై డియర్ డాడీ.. తండ్రికి సంచ‌ల‌న లేఖ రాసిన క‌విత‌

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

By Medi Samrat
Published on : 22 May 2025 8:38 PM IST

మై డియర్ డాడీ.. తండ్రికి సంచ‌ల‌న లేఖ రాసిన క‌విత‌

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. మే రెండో తేదీన ఆరు పేజీల్లో రాసినట్లు ఉన్న ఈ వైరల్ లేఖపై అటు క‌విత గాని.. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు గాని స్పందించ‌క‌పోవ‌డంతో అనేక‌ ఊహాగానాలకు తావిస్తుంది.

వరంగల్‌లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ‌ సభ నిర్వహణ తీరుపై క‌విత‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు లేఖ‌లో కనిపిస్తోంది. సభలో కేసీఆర్ ప్రసంగానికి ముందు, పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడి ఉండాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన నాయకులు, ధూంధాం కార్యకర్తలు ప్రసంగించి ఉంటే.. అది శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సభ ద్వారా కార్యకర్తలను పూర్తిగా ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ లీడర్స్‌కి యాక్సెస్‌ ఇవ్వడం లేదని పేర్కొన్న కవిత.. వరంగల్ సభ స్పీచ్‌లో మరింత పంచ్‌ ఉండాల్సిందని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ తల్లి విగ్రహం, గీతం గురించి మాట్లాడతారని అంతా అనుకున్నారని.. కానీ అలా జరగలేదన్నారు. ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదని.. వక్ఫ్‌ బిల్లు మీద కేసీఆర్ మాట్లాడతారని జనం భావించారని లేఖలో పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని.. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సభలో ప్రస్తావించలేదని కవిత వివరించారు.

BRS సభతో క్యాడర్ నైతికంగా బలపడిందని.. ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా నచ్చిందని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు సూపర్‌ .. పహెల్గామ్ అమరులకు నివాళి అర్పించ‌డం.. మౌనం పాటించ‌డం బాగుందని వివరించారు. రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టక పోవడం చాలా మందికి నచ్చిన అంశంగా మారిందన్నారు. సీఎం తిడుతున్నా మీరు హుందాగా ఉన్నారని.. పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుందని వివరించారు. ఇక బీజేపీ మీద కేసీఆర్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటాన్ని కూడా కవిత కీలకంగా ప్రస్తావించారు. వారిని తక్కువగా టార్గెట్ చేయడం వల్ల భవిష్యత్తుల్లో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. బీజేపీ పెట్టిన కేసులు కారణంగా తాను కూడా బాగా ఇబ్బందిపడ్డానని చెప్పారు.

Next Story