లేఖ లీక్ చేసిందెవరో బయటపెట్టాలన్నందుకే నాపై కక్ష కట్టారు: కవిత
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తనను తొలగించండంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
By Knakam Karthik
లేఖ లీక్ చేసిందెవరో బయటపెట్టాలన్నందుకే నాపై కక్ష కట్టారు: కవిత
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తనను తొలగించండంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. 'తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది. అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా...తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదేళ్లకాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. బుధవారం హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోన్నది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాలు మీకందరికి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రిగారైన కేసీఆర్ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఆ లేఖను లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్షగట్టారు. ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా నేను మీ వెన్నంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తాను. కార్మికులకు ఏ చిన్నకష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటాననని మాట ఇస్తున్నాను...అని కవిత పేర్కొన్నారు.