రేవంత్ రెడ్డి నాన్ సీరియస్ ముఖ్యమంత్రి.. తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు
రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాడని.. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి గోదావరి నీళ్లను చంద్రబాబు గిఫ్ట్ గా ఇచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
By Medi Samrat
రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాడని.. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి గోదావరి నీళ్లను చంద్రబాబు గిఫ్ట్ గా ఇచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఢిల్లీ మీటింగ్ లో బనకచర్లపై అసలు చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించారని అన్నారు. ఢిల్లీ మీటింగ్ లో మొదట చర్చ జరిగిందే బనకచర్ల మీద అని తనకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాన్ సీరియస్ ముఖ్యమంత్రి అని, తెలంగాణ హక్కులను కాలరాస్తోన్న ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారని.. ఇంకా కాలేజీలోనే ఉన్నాననుకొని చంద్రబాబుకు గోదావరి నీళ్లను కట్టబెట్టారని అన్నారు. ఢిల్లీ మీటింగ్ లో శాలువాలు కప్పుకొని సన్మానం చేయించుకొని రేవంత్ రెడ్డి బలికా బక్రా అయ్యారని.. ఆయన ఏం అయినా నష్టం లేదు కాని ఇక్కడ బలి అయ్యేది తెలంగాణ ప్రయోజనాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మీటింగ్ లో నాలుగు విజయాలు సాధించానని రేవంత్ చెప్పుకుంటున్నారని.. అందులో ఏ ఒక్క అంశం కూడా కొత్తది కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. టెలిమెట్రీ స్టేషన్లు ఇదివరకే ఉన్నాయని.. కేఆర్ఎంబీ ఏపీలో ఉండాలన్నది విభజన చట్టంలోనే ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల హక్కులను రేవంత్ రెడ్డి చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తెలంగాణలోని తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం చేపడితే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఇచ్చే కమీషన్ల కోసమే రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు రేవంత్ సద్దిమోస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి పక్షాన న్యాయపోరాటం చేసి బనకచర్లను ఆపితీరుతామన్నారు.
బనకచర్లపై చర్చించేందుకు ఢిల్లీకే వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ అఫీషియల్ మీటింగ్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం బనకచర్లపై సరైన రీతిలో చర్యలు తీసుకోకుంటే కలిసివచ్చే పక్షాలతో ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. ఈనెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని.. బనకచర్లతో పాటు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడని, ఆయనకు టీబీజీకేఎస్ బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఒక ఎమ్మెల్సీని జనాభా లెక్కల నుంచి తీసేశానని.. ఆయన ఎవరో తనకు తెలియదన్నారు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందన్నారు.