మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి.. సీఎం రాజీనామా చేయాలి

రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

By Medi Samrat
Published on : 9 May 2025 8:00 PM IST

మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి.. సీఎం రాజీనామా చేయాలి

రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణలో నెలకొన్న ఈ సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఐపీఎల్ ను వాయిదా వేసినట్లుగా మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని సూచించారు. దేశంలో యుద్ధ వాతావరణ నెలకొంటే దేశంలో అందాల పోటీలు పెట్టారన్న అపవాదు తెలంగాణకు వస్తుందని అన్నారు. ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయమని, తప్పుడు సంకేతాలకు తావునివ్వకూడదని అభిప్రాయపడ్డారు.

ఆపరేషన్ సిందూర్ కు మద్ధతుగా, భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు జరిగిన భారీ ర్యాలీకి ఎమ్మెల్సీ కవిత నాయకత్వం వహించారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను దిగ్విజయంగా భారత సైన్యం ధ్వంసం చేసిందని ప్రశంసించారు. సైన్యం వల్ల మనకు రక్షణ కలుగుతుందని, కాబట్టి వారికి ధైర్యం, స్థైర్యాన్ని నింపడానికి ర్యాలీ చేశామని చెప్పారు. పాకిస్తాన్ మన దేశంలోని ఎయిర్ పోర్టులను టార్గెట్ చేసుకొని చేసిన దాడులకు భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

“ఇది ధర్మయుద్ధం. భారత్ ఎప్పుడూ తప్పు చేయదు. నీతి, నిజాయితీతోనే యుద్ధం చేస్తున్నాం. మనం పాకిస్తాన్ భూభాగంలోని సామాన్య ప్రజలను ఏమి అనలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలనే ధ్వంసం చేశాము.” అని వ్యాఖ్యానించారు.

మరోవైపు, విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం రాకపోతే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేనప్పుడు పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైన, ప్రజలైనా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారని, కానీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని స్పష్టం చేశారు. అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా సీఎం మాట్లాడడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.

Next Story