ప్రేమ లేదు కాబట్టే రూపం మార్చారు : ఎమ్మెల్సీ కవిత

మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

By Medi Samrat  Published on  14 Dec 2024 4:24 PM IST
ప్రేమ లేదు కాబట్టే రూపం మార్చారు : ఎమ్మెల్సీ కవిత

మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుంది.. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది.. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ.. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుంది.? అని ప్ర‌శ్నించారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. కానీ అటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నారు.

ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. తెలంగాణ ఉధ్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంపై రేవంత్ రెడ్డి ఎక్కడా లేరన్నారు.. తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారన్నారు.. ఉద్యమకాలంలో ఉద్యమకారులపై తుపాకి ఎక్కిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిప‌డ్డారు.

ఉద్యమ సమయంలో నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం.. ఒక చేతిలో జొన్నకర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తామ‌న్నారు. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామ‌న్నారు.

తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రమం మొదలుపెట్టే సంప్రదాయాన్ని ఇకముందూ కొనసాగిస్తామ‌న్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామ‌న్నారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేస్తామ‌న్నారు.

Next Story