కేటీఆర్‌కు కవిత కౌంటర్..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.
By - Medi Samrat |
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, తెలంగాణలో ఆ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని 'ఎక్స్' వేదికగా అన్నారు. మద్యం కుంభకోణం కారణంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయంపాలైందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు కేటీఆర్ 'ఎక్స్' వేదికగా చేసిన పోస్టును చూశానని, తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారన్నారు. బీఆర్ఎస్ నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమా సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అభ్యర్థులను మార్చకుండా దోపిడీదారులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వడం, అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణి ఓటమికి కారణమని విమర్శించారు. ఈరోజు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడటం సరికాదన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు మద్యం కుంభకోణం పేరుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చారని, దీనివల్ల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు న్యాయస్థానంలో కవితకి న్యాయం జరిగిందని, భవిష్యత్తులో తమ పార్టీ నాయకులపై ఉన్న మిగిలిన అబద్ధపు కేసులు కూడా వీగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. నిందలే సాక్ష్యాలుగా, మీడియా ట్రయల్సే విచారణలుగా మారిన ప్రస్తుత "న్యూ ఇండియా"లో ఇది కొత్త ఆచారం అయిపోయిందని, ఎంత తప్పుదోవ పట్టించినా చివరకు న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.