ముందుగా రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి : ఎమ్మెల్సీ క‌విత

అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష‌ బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది.

By Medi Samrat  Published on  6 Feb 2024 10:08 AM GMT
ముందుగా రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి : ఎమ్మెల్సీ క‌విత

అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష‌ బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది. కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ శ్రేణులు కూడా ధీటుగానే బ‌దులిచ్చాయి. అలాగే సుమ‌న్‌పై మంచిర్యాల‌లో కేసు కూడా న‌మోదైంది. ఈ విష‌య‌మై కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత స్పందించారు.

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిద‌ని ఎమ్మెల్సీ క‌విత సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే.. నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందని విమ‌ర్శించారు.

సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతామ‌ని పేర్కొన్నారు.

Next Story