త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం : కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ జరిగింది.
By - Medi Samrat |
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మీరు బయట ఉండి బాధపడితే నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను.. కేసీఆర్ గారిని విమర్శించాలని లేదు. కానీ పదేళ్లు అవకాశం వస్తే ఏం చేశారు? అని ప్రశ్నించారు.
ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యం అన్నారు. కోదండరాం, ఆకునూరి మురళి రేవంత్ రెడ్డితో కలవటంతోనే కాంగ్రెస్‌ను నమ్మారు.. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చేదు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి.. మనవాళ్లే గాయం చేయటంతో నొప్పి ఎక్కువగా ఉందన్నారు.. ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించారు. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అని స్పష్టత ఇచ్చారు. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. మంచితనం, సహనశీలత, భోళాతనం తెలంగాణ తత్వం.. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లేనన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ని బిల్డింగ్ బయటికి గుంజుతరు అని హెచ్చరించారు.
మనవాళ్లు కాదు.. ధర్మం వైపు ఉండాలని శ్రీ కృష్ణుడు చెప్పారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉంది.. వారి కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
మనమంతా ఇలా చారిత్రక ప్రాంతమైన ఆర్టీసీ కళ్యాణ మండపంలో కలుసుకోవటం కొంత సిగ్గుగా, కొంత సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు ఒక్కటైతే ఇదే చోట మనమంతా తెలంగాణ జేఏసీగా ఏర్పాటయ్యామని.. ఆ తర్వాత మనం తెలంగాణను సాధించుకున్నామని.. కానీ మళ్లీ ఒకసారి ఉద్యమకారుల కోసం ఒక అడుగు ముందుకు వేసేందుకు ఇక్కడ కలుసుకున్నాం.. నిజానికి రాష్ట్రం రాగానే ఉద్యమకారులందరికీ మొదటి వరుసలోనే గౌరవం, ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించాం.. కానీ ఆ విధంగా జరగకపోవటం చాలా బాధ కలిగించే అంశం అన్నారు.
మన తెలంగాణ అనేది నిత్యం పోరాటాల గడ్డనే.. మానవాళి పుట్టినప్పటికీ నుంచి మన గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా.. ఎన్ని జన్మలు ఉన్న సరే మళ్లీ తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నానన్నారు.
మన నేలకు పునీతమైన, పురాతనమైన చరిత్ర ఉంది.. 1860 లోనే రామ్ జీ అనే గోండు బిడ్డను ఆయన అనుచరులను వెయ్యి మందిని ఒకే చెట్టుకు బ్రిటీష్ వాళ్లు ఉరి తీశారు.. ఆ తర్వాత మరో గోండు బిడ్డ కొమురం భీమ్ కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.. 1942 జులై 4వ తేదీన దొడ్డి కొమురయ్య అమరుడైతే తెలంగాణ మొత్తం అగ్గి అయ్యింది.. అప్పటి దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఒక్కటైంది.. 1942 కు ముందే మన ప్రాంతంలో భూ పోరాటాలు జరిగి భూ పంపిణీ జరిగింది. స్వాతంత్రం రాకముందు వరకు కూడా రజాకార్లు, సైన్యం చేసిన ఘోరాతి దురాగతలను భరించాం.. మనకు ఎప్పుడు కూడా శాంతి, సంతోషం లేదు.. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం పోరాటం చేయాల్సి వచ్చింది.. 1956 లో ఆంధ్రాతో మనల్ని కలిపారు.. కానీ కొన్ని సంవత్సరాలకే వాళ్లపై పోరాటం చేశాం.. 1962 లో ఇడ్లి, సాంబార్ గో బ్యాక్ ఉద్యమం చేశాం.. 1969 లో తెలంగాణ ఉద్యమం చేశాం.. 1969 లో తెలంగాణ ఉద్యమం చేసిన మన 369 మంది పిల్లలను కాసు బ్రహ్మనంద రెడ్డి పొట్టనపెట్టుకున్నాడు.. కానీ ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ కు అదే పేరు ఉంది. అందుకే మనకు బాధ.. ఏ చేదు గుర్తులు ఉండకూడదని అనుకున్నామో ఆ గుర్తులు ఇంకా ఉండటమే మనకు బాధ.. నక్సల్ ఉద్యమం చేసిన మన వాళ్లను రాజ్యం ఘోరాతి ఘోరంగా పొట్టన పెట్టుకుంది.. వరంగల్ లోని పద్మాక్షి గుట్ట ఇప్పటికీ నెత్తురోడుతోంది.. 1995లో వరంగల్ డిక్లరేషన్ తో మా తెలంగాణ మాకు కావాలని నినదించారు.. గద్దర్ సహా చాలా మంది మేధావులు అప్పుడు తెలంగాణ కోసం పోరాడారు.. అప్పటి వరకు కూడా మన విప్లవకారులు, మేధావులు, తెలంగాణ భావాజాలాన్ని కాపాడారు.. ఇక 2001లో కేసీఆర్ వచ్చి తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేశారు.. మొత్తం సమాజం కూడా ఆయన వెంట ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. స్వరాష్ట్రంలో కొంత మంది ఉద్యమకారులకే అవకాశాలు వచ్చాయి.. అవకాశాలు వచ్చిన వాళ్లు ఉద్యమకారుల భుజాలు తడుతారని భావించాం.. కానీ అవకాశం వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి వచ్చింది.. మనవాడే మనల్ని పురుగుల్ని చూసినట్లు చూసి అవమానించాడు.. ఇక ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారో, మనల్ని ఉద్యమంలో కొట్టించారో వాళ్లే కేసీఆర్ చుట్టూ చేరారు. కేసీఆర్ ని అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదు.. కానీ పదేళ్లు అవకాశం ఇస్తే ఎందుకు న్యాయం చేయలేదన్నది అడగాల్సిందే. కేశవరావ్ జాదవ్ చనిపోతే ఎందుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు? ఈ ప్రాంతం కాని ఎంతో మందికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహాం పెట్టాలని అప్పటి మున్సిపల్ మినిస్టర్ ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. ట్యాంక్ బండ్ పై కూడా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయాం.. ఇప్పుడున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ కూడళ్లలో ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నారు.. గద్దర్, బిరుదురాజు రామరాజు, సుద్దాల హన్మంతు లాంటి వాళ్ల విగ్రహాలు రవీంద్ర భారతిలో ఉండాలి.. కానీ ఎవరి విగ్రహాలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉద్యమ సోయి లేదు.. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం మన దౌర్భాగ్యం.. కానీ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోయాం.? మనం పోరాటం చేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం అవుతుందని అన్నారు.