Chevella Bus Accident : రూ. 7 లక్షలు ఏమాత్రం సరిపోవు.. కోటి రూపాయలు ఇవ్వాల్సిందే..!

చేెవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

By -  Medi Samrat
Published on : 7 Nov 2025 4:43 PM IST

Chevella Bus Accident : రూ. 7 లక్షలు ఏమాత్రం సరిపోవు.. కోటి రూపాయలు ఇవ్వాల్సిందే..!

చేెవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వమేన‌న్నారు. రోడ్డు బాగు చేయించకపోవటంతోనే ప్రమాదం జరిగిందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని.. గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నేషనల్ హైవే 163ని బాగు చేయించాలని స్థానికులు ధర్నా చేస్తే కేసులు పెడతారా.? అని మండిప‌డ్డారు.

మూడు నాలుగు రోజుల క్రితం చేవెళ్లలో జరిగిన యాక్సిడెంట్ రాష్ట్రం మొత్తాన్ని కలిచి వేసింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. ఐతే ప్రమాదం జరిగిన నేషనల్ హై వే 163 ని రిపేర్ చేయకపోవటం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. రోడ్డు బాగు చేయకపోవటానికి గతంలో పర్యావరణ అంశాలు కారణంగా ఉండే.. ఆ తర్వాత ఈ ప్రభుత్వం నావల్ రాడార్ కు పర్మిషన్ ఇచ్చింది. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రాడార్ కేంద్రానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఓ పక్క రాడార్ కేంద్రం, మరో పక్క వికారాబాద్ ను జిల్లా కేంద్రం చేసుకున్నాం. దీంతో ఈ రోడ్ పై వాహనాల సంఖ్య పెరిగింది. భారీ లోడ్ తో ఉన్న వాహనాలు అధికంగా వస్తున్నాయి. దీంతో అసలే చిన్నగా ఉన్న రోడ్డంతా కుంగిపోయింది. ఆ రోజు ప్రమాదాన్ని చూసిన వారంతా కూడా టిప్పర్, బస్సు రెండు రోడ్డు మధ్యలోకి వచ్చాయని చెబుతున్నారు. ఇది డ్రైవర్ల సమస్యానా? కాదా? అన్నది కాదు. ప్రభుత్వం రోడ్ వేయకపోవటమే ప్రమాదానికి కారణం అన్నారు.

ప్రభుత్వం తప్పిదం కారణంగానే యాక్సిడెంట్ జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 7 లక్షలు ఏమాత్రం సరిపోవు.. కోటి రూపాయలు ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు రిపేర్ చేయించకపోవటంతో దాదాపు 3 వందల మంది చనిపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ ప్రభుత్వమైనా సరే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరుస ప్రమాదాలకు నిరసనగా తాండూరులో ధర్నా చేసిన 30 మందిపై కేసులు పెట్టారు. ఇది దారుణం. వెంటనే వారిపై కేసులు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

గాయాలైన వారిని కూడా చూశాం. వారికి దీర్ఘకాలం సమస్యలు ఉండే అవకాశం ఉంది. పైగా వాళ్లంతా కూడా రోజువారీ కూలీ చేసుకునే వారే. రెండు, మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలంటే వారికి జీవనోపాధి కష్టం. గాయపడిన వారికి 2 లక్షలు అన్నారు. ఇప్పటి వరకు అవి కూడా అందలేదని బాధితులు చెబుతున్నారు. వారికి రెండు లక్షలు సరిపోవు. రూ. 10 లక్షలు ఇవ్వండి. అదే విధంగా రోడ్ కాంట్రాక్ట్ సంస్థ అయినా మేఘ వారి వెంటబడి రోడ్ త్వరగా వేయించండని కోరారు. కచ్చితంగా బాధితులకు పరిహారం పెంచి ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

Next Story