ఫిరాయింపులు ప్రోత్సహించడం వల్లే హ‌త్య‌లు.. జీవన్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జగిత్యాలలో కాంగ్రెస్ నేత హ‌త్య తీవ్ర సంచ‌ల‌న‌మైంది. మృతుడు గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచ‌రుడు

By Medi Samrat  Published on  22 Oct 2024 3:53 PM IST
ఫిరాయింపులు ప్రోత్సహించడం వల్లే హ‌త్య‌లు.. జీవన్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జగిత్యాలలో కాంగ్రెస్ నేత హ‌త్య తీవ్ర సంచ‌ల‌న‌మైంది. మృతుడు గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచ‌రుడు. ఈ విష‌య‌మై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని నమ్మకంగా ఉన్న వ్య‌క్తి మారు గంగారెడ్డి. ఆయ‌న‌ను జాబితాపూర్ గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి హతమార్చాడు.. సంతోష్ వెనుక బలమైన శక్తులు ఉండి ఈ నేరాన్ని చేయడానికి ప్రలోభ పెట్టారని అన్నారు. నిందితుడిని వెనక ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారు కాబట్టే ఇలాంటి దారుణం జరిగిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం రావడానికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించింద‌న్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుందన్నారు.

జగిత్యాల జిల్లాలో మా కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మేము అవమానాలకు గురవుతున్నామ‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యంగా చూస్తున్నారని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని.. వెంటనే ఈ నేరానికి పాల్పడ్డ వారిని వారి వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story