కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని.. అందుకే ఏసీబీ అధికారులు కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తప్పు చేయకపోతే ఆయనకు లీగల్ టీమ్ ఎందుకు అని ప్రశ్నించారు. దొంగలకు అండగా ఉంటారో, ప్రజలకు అండగా ఉంటారో? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలన్నారు.
కేటీఆర్ హెచ్ఎండీఏలో ఆస్తులు నీకు మీ నాన్న కేసీఆర్ కట్టబెట్టిండా.? 55 కోట్లు ప్రజల సొమ్ము.. ప్రభుత్వ ఆస్తి.. బాధ్యత గల శాసన సభ్యునిగా తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలన్నారు. మీ అవినీతిలో 55 కోట్లు చిన్నవి కావొచ్చు.. కానీ ప్రజల సొమ్ము దోచుకుంటే వదిలే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా ప్రభుత్వం వదిలి పెట్టదు. కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏమీ తప్పు చేయకపోతే కేటీఆర్ ఎందుకు విచారణకు హాజరు కాలేదన్నారు. డ్రామా రావు రాజకీయ లబ్ధీ కోసమే విచారణకు పోలేదన్నారు. దోచుకున్న ప్రజల సొమ్మును ప్రజలకు పంచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.