ఆయ‌న కేంద్ర మంత్రేనా.?.. బండి సంజ‌య్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్‌

కేంద్ర మంత్రి బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్‌లో విన్యాసాలు చేస్తున్నాడని.. ఆయ‌న కేంద్ర మంత్రో లేక క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ మంత్రో అర్థం కావ‌డం లేదని ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ ఎద్దేవా చేశారు.

By -  Medi Samrat
Published on : 14 Feb 2026 6:00 PM IST

ఆయ‌న కేంద్ర మంత్రేనా.?.. బండి సంజ‌య్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్‌

కేంద్ర మంత్రి బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్‌లో విన్యాసాలు చేస్తున్నాడని.. ఆయ‌న కేంద్ర మంత్రో లేక క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ మంత్రో అర్థం కావ‌డం లేదని ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ ఎద్దేవా చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. క‌రీంన‌గ‌ర్‌కు తాను చేసిన అభివృద్ది ఏమిటో ఒక్క మాట చెప్ప‌కుండా మ‌తాన్ని రెచ్చి గొట్టి ఓట్లు సంపాదించాడన్నారు. బండి సంజ‌య్ అన్ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికినా, ఇంత రెచ్చ‌గొట్టినా ప్ర‌జ‌లు బీజేపీకి మ్యాజిక్ ఫిగ‌ర్ ఇవ్వ‌లేదు.. బీజేపీకి స్ప‌ష్ట‌మైన తీర్పు రాలేదు.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్ర‌మే ఉందన్నారు.

రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో పొత్తులు, ఫ‌లితాల త‌ర్వాత పొత్తులు స‌హ‌జం.. స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పొత్తులు ఉంటాయన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో కాంగ్రెస్, ఎంఐఎం క‌లిసి కుట్ర చేస్తున్నాయ‌ని బండి సంజ‌య్ తెగ గింజుకుంటున్నాడు.. ఎంఐఎంతో మేం ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు.. పెట్టుకోబోం కూడా.. మాకు కేవ‌లం మ‌జ్లిస్ తో అవ‌గాహ‌న మాత్ర‌మే ఉంటుందన్నారు. ఎంఐఎం పోటీ చేసిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఉన్నారు.. పోరాడి ఓడిపోయారు.. కాంగ్రెస్, ఎంఐఎంకి, ఇండిపెండెంట్‌ల‌కు ఓట్లు వేసిన వాళ్లు కూడా క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లే.. ఇన్ని క‌బుర్లు చెపుతున్న నువ్వు ఇండిపెండెంట్ల‌ను ఎందుకు నీ పార్టీలో చేర్చుకున్నావు..? రాత్రి ఇంటికి పిలిచి ఎందుకు కండువాలు క‌ప్పావు..? అని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే పార్టీల కార్యాచ‌ర‌ణ ఉంటుందన్నారు. బీజేపీకి మేయ‌ర్ ప‌ద‌వి రాక‌పోతే ఒక్కొక్క‌రిని రోడ్ల‌పైనే ఉరికిస్తామ‌ని బండి సంజ‌య్ అంటున్నాడు.. బండి సంజ‌య్.. నువ్వు కేంద్ర మంత్రివేనా..? అందులోనూ హోం శాఖ స‌హాయ మంత్రివి నువ్వు.. స్వ‌యంగా మంత్రిగా ఉంటూ శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌ల్గించేలా మాట్లాడుతున్నావు.. బండి సంజ‌య్ ఎన్ని పెడ‌బొబ్బ‌లు పెట్టినా ప‌ట్టించుకునే వాడెవ్వ‌డు లేడు.. నీ ఉడ‌త ఊపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లు ఎవ‌రూ లేరు.. మీరెంత నీచ రాజ‌కీయాలు చేసినా.. తెలంగాణ బీజేపీకి స్థానం లేదు.. ఇది మ‌రోసారి నిరూపిత‌మైంది. 42 మున్సిపాలిటీల్లో మీకు వ‌చ్చింది గుండు సున్న‌.. సొంతంగా ఒక్క మున్సిపాలిటీ కూడా గెల‌వ‌లేదు.. 8 మంది ఎంసీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా మీకు ఒక్క మున్సిపాలిటీ కూడా ద‌క్క‌లేద‌న్నారు.

బీఆర్ఎస్ పార్టీ క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ లో ఎందుకు ప్ర‌చారం చేయ‌లేదు..? సిరిసిల్లలో ప్ర‌చారం చేసిన కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ లో ఎందుకు ప్ర‌చారం చేయ‌లేదు..? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ క్లోన్ లా క‌లిసిపోయారు.. ఉత్త‌ర తెలంగాణ‌లో బ‌లంగా ఉన్నామ‌ని చెప్పుకున్న బీజేపీ ఎందుకు ఓడిపోయింది.. బీఆర్ఎస్ స‌హ‌కారం తీసుకున్నా బీజేపీకి సీట్లు రాలేదు.. బండి సంజ‌య్ సైకో జోక‌ర్‌గా మారాడని మండిప‌డ్డారు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు అంట‌క‌ట్ట‌డం దారుణం.. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు బాగా సీట్లు వ‌చ్చాయ‌ని కేటీఆర్ చెప్పుకుంటున్నాడు..కింద‌ప‌డి కూడా పైచేయి నాదే అని కేటీఆర్ క‌థ‌లు ప‌డుతున్నాడన్నారు.

Next Story