కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అదనపు కలెక్టర్ చూస్తుండగానే ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్‌పై వాటర్ బాటిళ్లు విసిరే వరకు పరిస్థితి వెళ్లింది. జిల్లాలోని జంకాపూర్‌లో గురువారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నేత శ్యామ్‌నాయక్ హాజరయ్యారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. దీనిపై శ్యామ్‌నాయక్ వెంటనే స్పందిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. శ్యామ్‌నాయక్ వ్యాఖ్యలతో తనను అవమానించారని భావించిన కోవ లక్ష్మి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో తన ముందున్న వాటర్ బాటిళ్లను తీసి ఆయనపైకి విసిరారు. ఊహించని ఈ పరిణామంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.