తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాను అసెంబ్లీకి స్వతంత్ర సభ్యుడిగానే హాజరవుతానని, ఇకపై తనను ఎవరూ కట్టడి చేయలేరని అన్నారు. తెలంగాణలో బీజేపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. పార్టీలోని కొందరు నేతల వైఖరి వల్లే ఈ దుస్థితి దాపురించిందని, వారి వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఇకపై నాకు ఎవరూ బాస్‌లు లేరు. నన్ను ఎవరూ అదుపు చేయలేరు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం దొరికిందని రాజాసింగ్ అన్నారు. తానుగా మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కేవలం పార్టీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు వస్తేనే తిరిగి చేరికపై ఆలోచిస్తానని చెప్పారు.