ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియ‌స్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన కౌశిక్ రెడ్డి

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది

By -  Medi Samrat
Published on : 30 Jan 2026 6:13 PM IST

ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియ‌స్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన కౌశిక్ రెడ్డి

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది. సీపీ మతాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాక్యాలు చేయడాన్ని అసోసియేషన్ ఘాటుగా ఖండించింది. సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనుచితమని పేర్కొంది. సీపీ గౌస్ ఆలం మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రజాసేవలో ఉన్న పోలీసు అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీయేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. అలాగే, ఈ అంశంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఐపీఎస్ అధికారులపై అనవసర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు సహించబోమని అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్న పోలీసు వ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంలో అపోహలు పెంచే ప్రమాదం ఉందని అసోసియేషన్ హెచ్చరించింది.

మరోవైపు ఇప్పటికే పోలీస్ కమిషనర్‌‌ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126 (2), 132, 196, 299 బీఎన్ఎస్ సెక్షన్‌లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలావుంటే.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశ పూర్వకంగా అన్న మాటలు కాదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయ‌న‌.. ‘సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భ‌లంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారు.. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం.. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను.. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు.. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నానని ముగించారు

Next Story